ఆక్వారైతులకు రూ.2కే విద్యుత్‌

ఆక్వారైతులకు రూ.2కే విద్యుత్‌

ఏపీ రాష్ట్రంలోని ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరాలను ప్రకటించారు. ఈ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో ఆక్వా రైతులు, ఎగుమతిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్ వినియోగించడం మంచిది కాదన్నారు. పర్యావరణహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టిపెట్టాలి, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలిని సూచించారు.  రిజిస్ట్రేషన్ చేయకుండా ఆక్వాసాగు సరికాదు.. అక్రమ సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకుండా అందరూ జాగ్రత్తపడాలన్నారు.

కోస్తాంధ్రలో ఆక్వారంగాన్ని, రాయలసీమలో ఉద్యానరంగాన్ని ప్రోత్సహిస్తూ వచ్చామని తెలిపారు. ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్‌పై మరింత సబ్సిడీ ఇస్తామన్నారు. ఏడాది పాటు యూనిట్‌ రూ.2కే విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని సీఎం చంద్రబాబు  తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించినప్పుడే.. గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు, రైతులు ఒకరిని ఒకరు నిందించుకోకుండా సమస్య పరిష్కరించుకోవాలి సూచించారు. ఆక్వా సాగుకు 24 గంటలు విద్యుత్ సరఫరాతో పాటు విద్యుత్ ధరలపై సబ్సిడీ ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆక్వా రైతుల కృతజ్ఞతలు తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల నాణత్య నిర్దారణకు అత్యాధునిక లేబరేటరీలు ఏర్పాటు చేయాలని.. విద్యుత్ ధరపై మరింత సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతి పత్రంను అందజేశారు ఆక్వా రైతులు.