తెలకపల్లి రవి: ఇంచుకైనా మారని జగన్ యోచనలు

తెలకపల్లి రవి: ఇంచుకైనా మారని జగన్ యోచనలు

తెలకపల్లి రవి

ప్రతిపక్షాల విమర్శలు, కోర్టుల్లో వివాదాలు, మీడియాలో చర్చలు, అమరావతి నిరసనల తరువాత కూడా ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు ఇంచుకైనా మారలేదని హిందూస్తాన్ టైమ్స్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ స్పష్టం చేస్తోంది.  గతం కంటే గట్టిగా అయన తన నిర్ణయాలను, వ్యూహాలను సమర్ధించుకున్నారు.  వీటిపై ఎవరి చిత్రణ వారు ఇస్తున్నా, ఇవన్నీ ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులేనన్నది వాస్తవం.  కాకుంటే తదుపరి పరిణామాల పూర్వరంగంలో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం సమరించుకునే మాటలు అందులో ఉన్నాయి. 

హైదరాబాద్ కోల్పోయాము గనుక ఆ స్థాయిలో మరో మహా నగరాన్ని లక్ష కోట్లతో నిర్మించాలన్న ఆలోచన వక్రమైనదని జగన్ అనడంపై ఎక్కువ చర్చ జరుగుతున్నది.  మహానగరాల చారిత్రికంగా పెరుగుతాయిగాని అలా నిర్మించబడవని అయన అన్న మాట నిజమే.  అమరావతి లక్ష కోట్ల ఆదాయం తెచ్చే వనరుగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలను కూడా తోసిపుచ్చుతూ మొహలేని అప్పు భారంలో కూరుకుపోయేలా చేసిందని జగన్ కుండబద్దలు కొట్టి చెప్పారు. అయితే ఇప్పుడు మూడు రాజధానుల పేరా దాన్ని కూడా వదిలేస్తే మరింత భారం అన్న చర్చకు పోలేదు.  అసలు మూడు రాజధనులనేది సామన్యులనే మాట తప్ప నిజం కాదని కూడా ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.  రాజధానికి సంబంధించిన మూడు విధులను మూడు చోట్ల నుంచి వికేంద్రీకరణ చేయడమే జరుగుతుందన్నారు.  ఇది శివరామకృష్ణ కమిటి ఉపయోగించిన పదజాలమేనని కూడా సమర్ధించుకున్నారు.  అదే సమయంలో తన మంత్రివర్గ సభ్యుడైన కొడాలి నాని శాసన రాజధాని కూడా అమరావతిలో ఉండవద్దని చేసిన వాదనను తోసిపుచ్చినట్టయింద.  టిడిపి హయంలోఇన్ సైడర్ ట్రేడింగ్, బినామి కొనుగోళ్ళు వంటి ఆరోపణలను పునరుద్గాటిస్తూనే తను ఏదోచంద్రబాబుపై కోపంతో అమరావతిని మారుస్తున్నట్టు చెప్పడం తప్పన్నారు.  గతంలో మద్రాసు హైదరాబాద్ లను కోల్పోయిన చరిత్ర దృష్ట్యా అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టడం సరికాదన్నా ఆంగ్ల సామెతను ముఖ్యమంత్రి గుర్తు చేశార.  రాజధానికి పరిశ్రమల పెట్టుబడుల రాకకూసంబంధం లేదంటూ విశాఖ ఉక్కును ఉదహరించారు.  అమెరికాలోని ఓమహా నగర జనాభా నాలుగు లక్షలకు లోపైనా 23 ఫార్చ్యూన్ పరిశ్రమలు అక్కడే ఉన్నాయని వారెన్ బఫెట్ కూడా ఉంటారని గుర్తు చేశారు. రాజధాని వికేంద్రీకరణ ఇంతగా సమర్ధించిన జగన్ కోర్టులో కేసుల గురించి వాటివల్ల ఆటంకాల గురించి అసలు ప్రస్తావించకపోవడం విశేషం.

ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చే విషయమై జగన్ చేసిన వ్యాఖ్యలు కొంత అస్పష్టంగా ఉన్నాయి.  కొన్ని మీడియా సంస్థలు దాన్ని అసలు వదిలేశాయి.  మరికొన్ని భిన్నంగా ఇచ్చాయి.  అధికార పత్రిక ఇప్పటి వరకు ఇవ్వలేదు.  కేంద్ర నూతన విద్యావిధానం ఆరవ తరగతి తర్వాత ఇంగ్లీష్ మీడియం కు అవకాశంకల్పిస్తుంది గనుక అయిదవ తరగతి వరకూ అందుకు సిద్దం చేస్తామని అన్నట్టు వచ్చింది.  ఇంగ్లీష్ గురించిన ప్రాధమిక అవగానన పెంచేందుకు కృషి చేస్తామని కూడా అన్నారు.  ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీషులోనే చెబుతుంటే, ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడే పేదలు ఆ అవకశం కోల్పోతున్నారని వాటిలో కూడా మాతృభాషను తప్పనిసరి చేస్తే అప్పుడు అందరూ అందులోనే బోదించవచ్చునని జగన్ అన్నట్టు వచ్చింది.  ఇందులో ఏదైనా పునరాలోచన ఉందా అన్నది చూడాలి. 

ఆఖరి అంశం బీజేపి పట్ల సానుకూలతను జగన్ ప్రస్పుటంగా ప్రకటించారు.  జీఎస్టి లోటు భర్తీపై కేంద్రం మాట తప్పి అప్పులు తెచ్చుకోమనడాన్నితెలంగాణతో సహా చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా అదేమీ పెద్ద సమస్య కాదన్నట్టు మాట్లాడిన తొలి బిజెపియేతర ముఖ్యమంత్రి ఆయనే.  నిధులు ఆలస్యంగా వస్తున్నాయి తప్ప ఏదో తలకిందులైంది లేదని వెనకేసుకొచ్చారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం అంశాల వారిగా బీజేపికి మద్దతు ఉంటుందని కూడా చెప్పారు.