'అమ్మ ఒడి'పై మరో కీలక నిర్ణయం

'అమ్మ ఒడి'పై మరో కీలక నిర్ణయం

అమ్మఒడి అమలుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్‌ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్‌ విద్యార్థులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ అమ్మఒడి వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుని ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్న సీఎం.. మౌలిక సదుపాయాల కల్పనకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల ఎంపికకు తక్షణమే సెర్చ్‌ కమిటీలు వేయాలని,  ఈ సాయంత్రానికి సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.  30 రోజుల్లోగా ఉపకులపతులను ఎంపిక చేయాలని, వర్సిటీల్లో అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు.