కాపు రిజర్వేషన్లపై సీఎం కీలక వ్యాఖ్యలు..

కాపు రిజర్వేషన్లపై సీఎం కీలక వ్యాఖ్యలు..

కాపు రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరుగుతోన్న సమయంలో విపక్షం కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించడంపై సీరియస్‌గా స్పందించిన ఆయన.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదని.. అదే పద్ధతిలో కాపులను ఆయన మోసం చేశారని విమర్శించారు. అన్నీ తెలిసీ ప్రతి అడుగులోనూ మోసానికి పాల్పడ్డారన్నారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదన్నారు. తాను ఏదైనా చేయగలుగుతానని అనిపిస్తేనే చెబుతానని.. చేస్తానని చెప్పి మోసం చేయడం తన నైజం కాదన్నారు. కేంద్రం 10 శాతం రిజర్వేషన్లు ఇస్తే మనం ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదన్నారు సీఎం వైఎస్ జగన్. అగ్రవర్ణ పేదలకిచ్చే రిజర్వేషన్లల్లో కాపు రిజర్వేషన్లను కలిపి ఇవ్వలేం.. కేంద్ర మార్గదర్శక సూత్రాల ప్రకారం ఇది చెల్లదని స్పష్టం చేశారు ఏపీ సీఎం... ఇక, మెడికల్ కౌన్సిలింగులో ఐదు శాతం కాపు రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉందని గుర్తు చేసిన ఆయన... మాదిగలు, మాలల మధ్య కూడా ఇటువంటి చిచ్చే పెట్టారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చివరకు ఎస్సీ వర్గీకరణ వ్యవహారాన్ని కోర్టు కొట్టేసిందన్నారు. మనస్సాక్షిని చంపుకుని రాజకీయం చేయడం నాకు చేత కాదు... మేనిఫెస్టోలో చెప్పినదానికే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన సీఎం జగన్.. కమిషన్ వేసి.. ఛైర్మన్ మంజునాధ సంతకం లేకుండా నివేదిక ఎలా ఇస్తారు..? అంటూ గత టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.