ముగిసిన ఢిల్లీ పర్యటన.. తిరుపతికి బయల్దేరిన సీఎం జగన్..

ముగిసిన ఢిల్లీ పర్యటన.. తిరుపతికి బయల్దేరిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది.. రెండో పర్యటనలో భాగంగా.. కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షేకావత్, అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం.. మూడు రాజధానుల అంశం, శాసన మండలి రద్దు ప్రక్రియ వేగవంతం చేయడంతో సహా, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు.. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని అమిత్ షాను కోరారు సీఎం జగన్.. అమరావతి భూ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులపై కోర్టులు స్టే ఇవ్వడం, దర్యాప్తును అడ్డుకోవడం లాంటి అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక, అంతకు ముందు.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో అరగంట పాటు చర్చలు జరిపిన ఏపీ సీఎం.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్టును గడువులోపల పూర్తి చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం పర్యటనకు రావాలని జలశక్తి మంత్రిని కోరారు. ఇక, ఢిల్లీలో తన రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుపతికి బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. సీఎం తిరుపతి పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది.. సీఎం డిక్లరేషన్‌ రూల్స్‌ను పాటించాల్సిందేనంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.. దీంతో.. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.