జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు..!?

జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు..!?

తన కేబినెట్‌పై కసరత్తు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేబినెట్‌పై తనదైన ముద్రవేయాలనే యోచనలో ఉన్నారు. కేబినెట్‌లో చేర్చుకునేవారితో పాటు.. పదవుల కేటాయింపులో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని లేని విధంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు.. ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంల పదవులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించినట్టు సమాచారం. పాదయాత్ర నుంచి ఎన్నికల వరకు తనకు అండగా ఉన్న అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతీ వర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇక 25 మందితో కేబినెట్‌ను ఏర్పాటుకు సిద్ధమవుతూనే.. రెండున్నరేళ్ల తర్వాత 20 మంది మంత్రులను మారుస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఏ కేబినెట్‌లోనైనా విస్తరణ సమయంలో కొందరు మంత్రులను తొలగించడం.. కొత్తవారికి అవకాశం ఇవ్వడాన్ని చూశాం.. కానీ, సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఏకంగా 20 మందిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తారని వైసీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది.