ఏపీ పోలీస్ సరికొత్త యాప్.. దేశంలోనే తొలిసారి.. పీఎస్‌కు వెళ్లకుండానే..!

ఏపీ పోలీస్ సరికొత్త యాప్.. దేశంలోనే తొలిసారి.. పీఎస్‌కు వెళ్లకుండానే..!

దేశం ఏరాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పీఎస్‌లో లభించే అన్నిరకాల  సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు.. అంతే కాకుండా ఫిర్యాదులకు రశీదు కూడా పొందే అవకాశం కూడా ఈ యాప్‌లో ఉంది. మొత్తానికి ఈ యాప్‌తో పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికినట్టు అయ్యింది. ఈ యాప్‌ను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఇక యాప్‌లో అందించే సేవల విషయానికి వస్తే.. 
* కేసు దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు,  రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతులు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు.  
* వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో  వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం కూడా ఈ యాప్ సొంతం.
* ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 12 మాడ్యూల్స్‌తో  మహిళలకు రక్షణగా, తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణగా ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని  కల్పించనుంది. 
* మహిళలకు అన్ని సందర్భాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన దిశ మొబైల్ అప్లికేషన్ (ఎస్‌వోఎస్‌) స్వల్ప వ్యవధిలోనే 11 లక్షల డౌన్‌లోడ్స్‌ నమోదు చేసింది. 568  మంది నుండి  ఫిర్యాదులు స్వీకరించగా 117 ఎఫ్ఐఆర్ లను నమోదుచేసి చర్యలు తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 
* ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే  సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 1,850 పిటిషన్లు అందగా 309 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.
* సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు.
* రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు వీడియో కాన్ఫరెన్స్  సౌకర్యం. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా  రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం. నిరంతర నిఘా కోసం డ్రోన్‌ల నుండి  ప్రత్యక్ష ప్రసారం.
* అన్ని పీఎస్‌లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు ఇప్పటికే అందుబాటులో బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (బీడబ్ల్యూసీ) పరికరాలు. 
* స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు మరియు స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం.
* సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ ఈ సంవత్సరంలో ఇప్పటికే 37 అవార్డులు.
* పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్.. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు)
* ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌ 87 రకాల సేవలు

శాంతి భద్రతలు: నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌, దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు, తప్పిపోయిన కేసులు /దొరికిన వారు / గుర్తు తెలియని మృతదేహాలు, అరెస్టుల వివరాలు, వాహనాల వివరాలు 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు: ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌), ఈ–చలానా స్టేటస్‌..
పబ్లిక్‌ సేవలు: నేరాలపై ఫిర్యాదులు, సేవలకు సంబంధించిన దరఖాస్తులు, ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు, లైసెన్సులు, అనుమతులు, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ 
రహదారి భద్రత: బ్లాక్‌ స్పాట్లు, యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌, రహదారి భద్రత గుర్తులు, బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు.
ప్రజా సమాచారం: పోలీస్‌ డిక్షనరీ, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌, టోల్‌ఫ్రీ నంబర్లు, వెబ్‌సైట్ల వివరాలు, న్యాయ సమాచారం, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు.