గవర్నర్‌తో సీఎం జగన్ కీలక చర్చలు..!

గవర్నర్‌తో సీఎం జగన్ కీలక చర్చలు..!

విజయవాడలో ఉన్న గవర్నర్ నరసింహన్‌తో కీలక చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... గవర్నర్‌ బస చేసిన గేట్‌వే హోటల్‌కు వెళ్లి ఆయనతో సమావేశమైన సీఎం జగన్.. దాదాపు 45 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. విభజన సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుండగా... తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం తర్వాత.. గవర్నర్‌ను ఏపీ సీఎం కలవడం కీలకంగా మారింది. షెడ్యూల్-9,10 సంస్ధల ఆస్తుల విభజనపై చర్చ జరిగినట్టుగా సమాచారం అందుతుండగా... దామాషా పద్ధతిన ఆస్తుల పంపకం జరగాలని సీఎం వైఎస్ జగన్ కోరినట్టుగా  తెలుస్తోంది. ఇక, నీటి పంపకాల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించే అంశంపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం. మరోవైపు త్వరలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం.. బడ్జెట్ కూడా శాసనసభలో ప్రవేశపెట్టనుండడంతో.. బడ్జెట్‌లో పొందుపర్చిన పథకాలు.. కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్న ఆర్థికపరమైన అంశాలపై గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ చర్చించనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.