ఐపీఎస్‌ బదిలీలపై డీజీపీకి సీఎం కీలక ఆదేశాలు

ఐపీఎస్‌ బదిలీలపై డీజీపీకి సీఎం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టీమ్ రెడీ అవుతోంది.. ఇప్పటికే ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా.. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు సీఎం వైఎస్ జగన్. ఐపీఎస్ బదిలీలపై డీజీపీ సవాంగ్ కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం తాడేపల్లిలో సీఎం జగన్‌తో సమావేశమయ్యారు డీజీపీ గౌతమ్ సవాంగ్. ఐపీఎస్ అధికారుల బదిలీలపై చర్చించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారుల బదిలీపై చర్చ జరిగినట్టు సమాచారం. పలువురు ఐజీలు, జిల్లాల ఎస్పీలకు స్థానచలనం ఉండే అవకాశం ఉందనే చర్చసాగుతోంది. ఎవరిని ఎక్కడికి పంపాలి... ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై డీజీపీకి సూచనలు చేశారు సీఎం వైఎస్ జగన్.. ఇక, పోలీసులకు వారాంతపు సెలవులు ఇచ్చే అంశంపై సీఎం దృష్టిపెట్టారు. వీలైనంత త్వరగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. వీక్లీ ఆఫ్ లపై అధ్యయన కమిటీని నియమించామని... అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నర్  నేతృత్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు డీజీపీ. అయితే, వారం రోజుల్లో అధ్యయన నివేదిక పూర్తి చేసి ఇవ్వాలని సవాంగ్‌ను ఆదేశించారు సీఎం. కానిస్టేబుల్ సహా పై స్థాయిలోని ఉద్యోగాలకు వారాంతపు సెలవు ఇవ్వడంపై అధ్యయనం చేయనుంది రవిశంకర్ అయ్యన్నర్ కమిటీ... మరోవైపు, సీఎంతో సమావేశం అనంతరం అజయ్ కల్లంతో సమావేశమయ్యారు డీజీపీ గౌతమ్ సవాంగ్.