మరోసారి ఢిల్లీకి జగన్.. హాట్‌టాపిక్‌గా మారిన హస్తిన పర్యటన..!

మరోసారి ఢిల్లీకి జగన్.. హాట్‌టాపిక్‌గా మారిన హస్తిన పర్యటన..!

ఒక్కరోజు గ్యాప్‌లో రెండోసారి హస్తినకు వెళ్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి... బుధవారం ప్రధాని మోడీతో సుదీర్ఘ భేటీ అయిన ఆయన.. ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీకి పిలుపురావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. అమిత్ షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా సీఎం జగన్ ను పట్టించుకోని కేంద్రం ఆకస్మికంగా వరుస భేటీలకు అవకాశం ఇవ్వడం ఆసక్తిరేపుతోంది. ముఖ్యంగా ప్రధానితో జరిగిన సుధీర్ఘ భేటీలో విభజన సమస్యలు, పెండింగ్ నిధులతో పాటు మూడు రాజధానులు, శాసన మండలి రద్దు అంశాలను ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను వివరించడంతో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత ప్రభుత్వంతో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్ లో ఉంది.. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్రస్ధాయిలో ఆందోళనలు, ఆరోపణలు చేస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 

ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావించిన మూడు రాజధానులు, శాసన మండలి రద్దు తో పాటు హైకోర్టు తరలింపు వ్యవహారాలను కేంద్ర హోం శాఖ పర్యవేక్షిస్తుంది.. ఇందులో భాగంగానే హోం మంత్రి అమిత్ షాతో సిఎం జగన్ ప్రత్యేక భేటీ కోసం మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చట్టం, కర్నూలు జుడిషియల్ రాజధాని ప్రకటనతో హైకోర్టు తరలింపు వ్యవహారానికి సంబంధించిన అంశాలను అమిత్ షాతో చర్చిస్తారు.. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న దిశ యాక్ట్ తో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన 9,10 షెడ్యూల్స్ అంశాలు కూడా చర్చించనున్నారు. అమిత్ షాతో భేటీ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ప్రధానితో భేటీలో  రెవెన్యూ లోటు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు , కడప స్టీల్ ప్లాంటు అంశాలున్న నేపధ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.. అవసరమైతే  ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేసి రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ ను కలవనున్నట్లు సమాచారం.