మంత్రిపై సీఎం జగన్‌ సీరియస్‌..? ఆ వ్యవహారమే కారణం..!

మంత్రిపై సీఎం జగన్‌ సీరియస్‌..? ఆ వ్యవహారమే కారణం..!

ఆంధ్రప్రదేశ్‌లో బెంజ్ కారు ఎపిసోడుతో ఈఎస్ఐ స్కాం కొత్త మలుపు తిరిగింది. ఈకేసులో ఇప్పటికే కొందరిని జైలుకు పంపింది ఏసీబీ. మరిన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఏ-14గా ఉన్న నిందితుడు కార్తీక్... మంత్రి గుమ్మనూరు జయరాం కొడుక్కి బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారని టీడీపీ ఆరోపించింది. దీనికి సంబంధించి ఫొటోలు.. వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. దీంతో మంత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే స్వగ్రామంలో పేకాట క్లబ్బు.. పోలీసులపై దాడి విషయంలో మంత్రి జయరాంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బెంజ్‌ ఎపిసోడ్‌తో చిక్కులు తప్పవన్న టాక్‌ నడుస్తోంది. 

అవినీతి విషయంలో ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. సీఎం జగన్ సహించడం లేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. ఇటీవల టెండర్ల రద్దే ఉదాహరణగా చెబుతున్నారు. ఇక మంత్రులు చేసే తప్పులు, పొరపాట్లను ఏమాత్రం ఆయన సహించే పరిస్థితుల్లో లేరన్నది స్పష్టమవుతుంది. ఈ క్రమంలో మంత్రి జయరాం మెడపై కత్తి వేలాడుతోందనే భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఇలా పట్టించుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ టీడీపీ లేదా బీజేపీ టార్గెట్‌లోకి వెళ్లిపోతారనే భావన ఉన్నా.. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా ఉన్నారనేది సమాచారం. ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోకూడదనే లైన్ తీసుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వానికి.. సీఎంకు మరింత చెడ్డ పేరు తీసుకొస్తారనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మంత్రి జయరాం భవితవ్యం ఎలా ఉంటుంది..? అన్నది ఆసక్తిగా మారింది.