ఢిల్లీకి ఏపీ సీఎం.. వీటిపైనే చర్చ...!

ఢిల్లీకి ఏపీ సీఎం.. వీటిపైనే చర్చ...!

హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. నేడు ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. ప్రధాని నరేంద్రమోడీతో భేటీకానున్నారు. పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్ వివిధ నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని అమలు చేసే వ్యవహరం ఇప్పుడే నెమ్మదిగా ప్రారంభమైంది. నవరత్నాల పొందుపరిచిన ప్రధాన అంశం.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన ప్రధానమైన హామీ రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ మేరకు కావాల్సిన కసరత్తు కూడా పూర్తి చేసేసింది. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 మేర సాగుకు సాయం చేయాలని డిసైడైంది. అయితే ఇందులో కేంద్రం ఇచ్చే నిధులు రూ. 6వేలు పోనూ మిగిలిన రూ.6500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. మరోవైపు లబ్దిదారులైన కౌలు రైతులకు మాత్రం రూ.12,500 తానే భరించాలని సర్కార్ నిర్ణయించుకుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్లో.. వైఎస్సార్ రైతు భరోసా పథకం అత్యంత ప్రాధాన్యమైందనే చెప్పాలి. ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ .. ప్రధాని మోడీని ఆహ్వానించనున్నారు. ఈ పథకానికి కేంద్ర నిధులు కూడా వినియోగిస్తున్నందున..  ప్రధాని పేరు పెడుతున్నామని నేరుగా మోడీకే జగన్ చెప్పబోతున్నట్టు సమాచారం. 

మరోవైపు ఆర్ధిక క‌ష్టాల్లోఉన్న ఏపీని నిధులు ఇచ్చి ఆదుకోవాల‌ని ప్రధాని మోడీని సీఎం జ‌గ‌న్ కోర‌నున్నారు. సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టాక ప్రధాని మోడీతో జరిపిన తొలి భేటీలోనే పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్ వ్యవ‌హారంపై జ‌గ‌న్ ప్రధానికి వివ‌రించారు. ఈ క్రమంలో పోలవరం నిర్మాణానికి ప్రస్తుతం పరిస్థితులు.. కోర్టు వ్యవహారాలు.. రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ఆదా అయిన నిధులు వంటి అంశాలను ప్రధానికి కూలంకుషంగా వివరించనున్నారు సీఎం జగన్. ఇక ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ‌తంలో ఖ‌ర్చు చేసిన నిధులు విడుద‌ల చేయాల‌ని కోర‌నున్నారు.. త్వరిత‌గ‌తిన పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇచ్చిన స‌హాక‌రించాల‌ని కోర‌నున్నారు. కేంద్రం నుంచి వివిధ శాఖ‌ల‌కు రావాల్సిన నిధులు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కూడా ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ప‌వ‌ర్ ప‌ర్చేజ్ అగ్రిమెంట్లను రాష్ట్ర ప్రభుత్వం స‌మీక్షించడంపై ఇప్పటికే ప‌లుమార్లు కేంద్రం నుండి ఏపీ ప్రభుత్వానికి లేఖ‌లు రావడం.. ఇబ్బందికరంగా మారింది. ఇదే అంశంపై ప్రధానికి వివ‌రించ‌నున్నారు సీఎం జ‌గ‌న్. ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు ప‌డుతున్న ఇబ్బందుల‌ను ప్రధానికి నివేదించ‌నున్నారు. దీంతో పాటుగా వెనుకబడిన జిల్లాలకు నిధులు.. కడప స్టీల్ ప్లాంట్, ఏపీకి మేజర్ పోర్టు అనుమతి వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించనున్నారు.