ప్రధానితో ప్రత్యేకంగా భేటీకానున్న సీఎం జగన్..!

ప్రధానితో ప్రత్యేకంగా భేటీకానున్న సీఎం జగన్..!

ఇవాళ తిరుమలలో కళియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కొలంబో నుంచి మోడీ.. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. ప్రధాని మోడీకి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4:40 గంటలకు బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశం కాబోతున్నారు, సాయంత్రం 6 గంటలకు మోడీ.. శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రధాని మోడీతోపాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రి 8:15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌ వెళ్లిపోతారు. దర్శనం అనంతరం ప్రధానితో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదే సందర్భంగా పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు, విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధాని మోడీతో సీఎం చర్చించనున్నారు. పెండింగ్ అంశాలపై ప్రధాని మోడీకి సీఎం వినతిపత్రం అందజేసే అవకాశం ఉంది.