మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్... 

మండలి రద్దుకు ముహూర్తం ఫిక్స్... 

శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉన్నది. కానీ, వైకాపాకు తగినంత మద్దతు లేదు.  శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులు మండలిలో అడ్డుకోవడంతో బిల్లులు చట్టం కాకుండా వెనక్కి వస్తున్నాయి.  ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.  దీంతో ప్రభుత్వం మండలిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.  మండలి ఉండాలా వద్దా అనే విషయంపై మంత్రులు, మేధావులు తగిన సమాచారం ఇవ్వాలని, వారి అభిప్రాయాలను బట్టి మండలిపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.  

ఒకవేళ మండలిని రద్దు చేస్తే వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే విషయాలను కూడా చర్చలు జరుపుతున్నారు.  దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే అమలులో ఉన్నాయి. మండలి కోసం రోజుకు కోటి రూపాయల ఖర్చు అవుతుందని, ఆంధ్రప్రదేశ్ లాంటి పేద రాష్ట్రానికి ఇప్పుడు మండలి అవసరమా అని జగన్ ప్రశ్నించారు.  మండలి గురించి తాను చాలా ఆశలు పెట్టుకున్నానని, ప్రజలకు మంచి చేస్తుందని నమ్మానని జగన్ పేర్కొన్నారు.  నాతో పాటు ప్రజలందరి నమ్మకాలను వమ్ముచేసింది. ఛైర్మన్ షరీఫ్ నిష్పాక్షింగా సభను నిర్వహించలేకపోయారు. గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు డైరెక్షన్స్‌ను ఆయన అనుసరించారు. మేం ప్రవేశపెట్టిన బిల్లులపై మండలి చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. లేదంటే సవరణలు చేసి తిప్పి పంపవచ్చు. కానీ ఇవేమీ లేకుడా విచక్షణా అధికారాల పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపించారని జగన్ పేర్కొన్నారు.  మండలి రద్దుపై వైఎస్ జగన్ సోమవారం రోజున ఓ నిర్ణయం తీసుకుంటారని సమాచారం.  రద్దు చేస్తే ఏ రూల్ ప్రకారం రద్దు చెయ్యొచ్చు... ఎలా రద్దు చేస్తారు అనే విషయాల కోసం ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటోంది.