జిల్లా కలెక్టర్లే నా కళ్లు, చెవులు : జగన్

జిల్లా కలెక్టర్లే నా కళ్లు, చెవులు : జగన్

 గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ల పల్లె నిద్ర అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయం అరా తీసింది. వారంలో ఒక్కరోజు జిల్లా కేంద్రాలకు వెలుపల రాత్రి నిద్ర చేయాల్సి ఉన్నా ఈ అంశాన్ని పట్టించుకోక పోవటం సరికాదని హితవు పలికింది సీఎంవో. మండలం స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటంతోనే కొందరు సరిపుచ్చుతున్నారని సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. విమర్శలు చేసేందుకు ఎవరికీ తావివ్వొద్దని స్పష్టం చేసింది సీఎంవో. ప్రతి కలెక్టర్ నెలలో 15 రోజుల పాటు జిల్లా కేంద్రాలకు వెలుపల నిద్ర చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా నిర్దేశించినట్టు స్పష్టం చేసింది సీఎంవో.

రాత్రి నిద్ర చేసిన ప్రతి కలెక్టర్ ఫోటో గ్రాఫ్ ను వెబ్ సైట్ తో పాటు సీఎంవో వాట్స్ అప్ లో అప్ లోడ్ చేయాలని సూచన చేసింది సీఎంవో. ఇక జిల్లా కలెక్టర్లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్న ఆయన... నెలలో కనీసం 15 రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా, క్షేత్రస్థాయిలో పర్యటనలకే సరైన ఫీడ్‌బ్యాక్ వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.

ప్రజలు, లబ్ధిదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ప్రభుత్వానికి కీలకమని... రాత్రిపూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. రాత్రి నిద్రతో క్షేత్రస్థాయి పరిస్ధితులు మెరుగుపడతాయని, కొంతమంది కలెక్టర్లు పర్యటనలకు వెళ్లడం లేదని తన దృష్టికి వచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వెంటనే ఈ పద్ధతి మారాలని.. ప్రతి కలెక్టర్‌ తప్పనిసరిగా వారంలో ఒకసారి జిల్లా కేంద్రం వెలుపల హాస్టల్స్ లేదా ఆస్పత్రిలో ఎక్కడో ఒక చోట నిద్ర చేయాలన్నారు. పరిపాలనలో జిల్లా కలెక్టర్లే నా కళ్లు, చెవులు అని... ప్రజలకు, ప్రభుత్వానికి వారే వారధి లాంటి వారని సీఎం తెలిపారు.