అంచెలంచెలుగా మద్యపాన నిషేదం విధిస్తాం

అంచెలంచెలుగా మద్యపాన నిషేదం విధిస్తాం

ఆంధ్రప్రదేశ్ లో అంచెలంచెలుగా మద్యపాన నిషేధం విధిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖలో మార్పులు తెస్తామని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలివిడతగా బెల్టుషాపుల నిర్మూలనపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కో అధికారి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని సారా తయారీని అరికట్టాలని ఇప్పటికే ఆదేశిలిచ్చామని చెప్పారు. కల్తీమద్యం అమ్మకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించామన్నారు.

'సీఎం ఆలోచనల మేరకు ఎక్సైజ్‌ నూతన పాలసీ రూపొందిస్తాం. ప్రభుత్వం చేసే మంచి పనుల విషయంలో మీడియా ప్రజలకు వారధిలా నిలవాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది.. బడి, గుడికి దూరంగా మద్యం షాపులు ఉండేలా చేస్తాం. పేదలకు మద్యాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతాం. మద్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది అన్ని కుటుంబాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం లక్ష్యం. కల్లుగీత కార్మికులను ప్రభుత‍్వం అన్ని విధాలా ఆదుకుంటుంది' అని మంత్రి నారాయణ స్వామి తెలిపారు.