సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్

సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్

ముగ్గురు ఐపీఎస్ అధికారులను సీఈసీ బదిలీ చేయడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బృందం ఇచ్చిన ఫిర్యాదు తో శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ,  ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావులను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ సీఈసీ మంగళవారం నాడు రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ నేతలు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా సీఈసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. 

ఐపీఎస్ అధికారుల బదిలీలను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు తన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఏపీ సర్కార్ వాదనతో ఏకీభవించలేమని తెలిపింది. ఈసీ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.