ఆగస్ట్ 15కి గ్రామ వాలంటీర్ల నియామకం

ఆగస్ట్ 15కి గ్రామ వాలంటీర్ల నియామకం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూసేందుకు గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ప్రభుత్వ పథకం గడప గడపకు చేరవేసే విధంగా ఈ గ్రామ వాలంటీర్లు పని చేస్తారు. గ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో భాగంగా గ్రామ వాలంటీర్లు, పట్టణాల్లో యువతను వార్డు వాలంటీర్లుగా నియమించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లుగా మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. 

ఈ నియామకాలను ఆగస్ట్ 15వ తేదీకి పూర్తి చేసి నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4లక్షల 33వేల 126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ap.gov.in వెబ్ సైట్‌లో జూలై నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. గ్రామాల్లో 50 కుటుంబాలకో వాలంటీర్ ను నియమించి నెలకు రూ.5 వేలు చొప్పున వేతనం చెల్లించనున్నారు. పట్టణ వాలంటీర్లు డిగ్రీ, గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంత వాలంటీర్లు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి. ఆగస్టు 15కు ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు.