రాజధానిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

రాజధానిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

ఓ వైపు గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 6 వేలకు పైగా ఇళ్లను రద్దు చేసిన ఏపీ సర్కార్.. మరోవైపు లక్ష ఇళ్ల నిర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టో హామీలపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్... ఇప్పటికే నవరత్నాలు, మద్యపాన నిషేధంపై మార్కదర్శకాలు విడుదల చేసంది. ఇక, పేదవాడికి సొంతింటి కల నెరవేర్చే దిశగా కార్యాచరణ ప్రారంభించింది. రాజధాని నగరం విజయవాడలోనే దాదాపు లక్ష ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాధమిక అంచనా వేసింది. వచ్చే ఉగాది నాటికి పేదింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల పేదలకు ఇళ్ల స్ధలాలు మంజూరు చేసేందుకు నిర్ణయించింది. 

విజయవాడ నగరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి ఇళ్లనే నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జీ+3 పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని డిసైడయ్యింది. ఒక్క ఎకరానికి  జీ+3 పద్ధతిలో 100 ఇళ్లు నిర్మిస్తారు. ఈ లెక్కన వెయ్యి ఎకరాల్లో లక్ష ఇళ్లు నిర్మించాలని అంచనా. అయితే విజయవాడలో వెయ్యి ఎకరాలు సేకరించడం అసాధ్యం. దీంతో నగర శివార్లు, పరిసర ప్రాంతాల్లో సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పరిసర ప్రాంతాలైన రామవరప్పాడు, జూపూడి, అంబాపురం, జక్కంపూడి, నున్న, గొల్లపూడి తదితర గ్రామాల్లో భూముల కోసం రెవెన్యూశాఖ అన్వేషిస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు గుర్తించడంతో పాటు వాటికి దగ్గరలోనే వున్న  రైతుల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.