ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డితే అంతే.. స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డితే అంతే.. స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కినా.. కేసుల విచార‌ణలో జాప్యం జ‌ర‌గ‌డంపై సీరియ‌స్‌గా దృష్టిసారించింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. వీలైనంత త్వ‌ర‌గా ఈ కేసుల‌ను పూర్తి చేసే విధంగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది వైఎస్ జ‌గ‌న్ స‌ర్కార్.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులను వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్.. సుదీర్ఘ కాలం పాటు ఏసీబీ కేసులు పెండింగులో ఉంటే అవినీతిని కట్టడి చేయలేమని భావిస్తోన్న ప్రభుత్వం.. దీంతో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చింది.

కాగా, 100 రోజుల్లోగా రెడ్ హ్యాండెడ్ ఏసీబీ కేసులు కంప్లీట్ చేసేలా తీసుకున్ననిర్ణ‌యానికి గ‌తంలోనే ఏపీ కేబినెట్ ఆమోదం తెల‌పింది.. అవినీతికి పాల్పడిన వారికి 100 రోజుల్లో శిక్షలు వేసేలా సవరణలు చేసింది.. వివిధ స్ఠాయిల్లో కేసుల విచారణకు సంబంధించి టైమ్ లైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.. ఇక‌, 1991 నుంచి 2020 వరకు 476  రెడ్ హ్యాండెడ్ కేసులు ఏసీబీలో పెండింగులో ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్న స‌ర్కార్.. 1991 నుంచి 2020 వరకు ఏసీబీలో మొత్తం 1686 పెండింగ్ కేసులున్నట్టు జీవోలో వెల్ల‌డించింది.. మ‌రోవైపు.. 100 రోజులు దాటితే జాప్యానికి కారణమైన విభాగ ఉన్నతాధికారి, సదురు ఏసీబీ అధికారిపై చర్యలు ఉంటాయని స్ప‌ష్టం చేసిన ఏపీ ప్ర‌భుత్వం.. ఏసీబీ డీజీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన సిఫార్సులకు అనుగుణంగా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.