ఏపీ మండలి కార్యదర్శిపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం?

ఏపీ మండలి కార్యదర్శిపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం?


ఏపీ మండలి సెలక్ట్ కమిటీ రచ్చ కొనసాగుతోంది. సెలక్ట్ కమిటీ ఫైల్ పంపడంపై ఛైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలు పాటించాల్సిందేనంటూ మరోసారి సెక్రటరీకి ఫైల్ పంపారు. మరోవైపు ఉభయసభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. బిల్స్ సెలక్ట్ కమిటీకి వెళ్లాయని...రెండు రోజుల్లో కమిటీల ఏర్పాటు జరుగుతుందని మండలి చైర్మన్ ప్రకటించి రెండు వారాలు దాటిపోయింది. అయితే ఇప్పటికీ ఆ కమిటీలు ఏర్పాటు కాలేదు. పార్టీల నుంచి వచ్చిన లేఖలతో కమిటీలు ఏర్పాటు చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం అమలులోకి మాత్రం రాలేదు. సెలక్ట్ కమిటీల ఏర్పాటుపై ఈమేరకు మండలి సెక్రటరీ నుంచి బులిటెన్ విడుదల కావల్సి ఉంది. అయితే దానిపై ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాద్యం కాదని ఫైల్ ను కార్యదర్శి చైర్మన్ కు తిప్పిపంపారు. 

ఇప్పుడు ఛైర్మన్ మరోసారి ఫైల్ ను కార్యదర్శికి పంపినట్టు సమాచారం. సభలో తాను ఛైర్ నుంచి ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెలక్ట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన మరోసారి సూచించారు. స్వయంగా ఛైర్మన్ ఫైల్ పంపుతుంటే కార్యదర్శి అడ్డుపడటంపై షరీఫ్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ సారి అదేశాలు అమలు చెయ్యకపోతే చర్యలు తప్పవని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు సెక్రటరీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు ఈ రగడ జరగుతుండగానే ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

దీంతో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆర్డినెన్స తెచ్చేందుకు సర్కారుకి వెసులుబాటు వచ్చింది. బిల్లులు మండలి ముందున్నా.. సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులు సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భాలు రాజ్యసభలోనూ.. వివిధ అసెంబ్లీల్లోనూ ఉన్నాయని చర్చ జరుగుతోంది. ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా కేంద్రం  ఆర్డినెన్స్ తెచ్చిందని సచివాలయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఆర్డినెన్స్ కు సంబంధించి వచ్చే క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.