స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ విషయంలో వెనక్కు తగ్గని సర్కార్.. అత్యవసరం అంటూ ఆదేశాలు !

స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ విషయంలో వెనక్కు తగ్గని సర్కార్.. అత్యవసరం అంటూ ఆదేశాలు !

విశాఖలో నిర్మించే స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతోంది. ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా దానికి సంబంధించి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం కోసం 30 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా.. ఈ ప్రక్రియను అత్యవసర అంశంగా పరిగణించాలని సూచించింది. కాపులుప్పాడలోని కొండపై స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది.

దీనికి అనుగుణంగా ఈ నెల 16వ తేదీన శంకుస్థాపన కూడా చేసిందని ప్రచారమూ ఉంది.  హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వం రాజధాని తరలింపు ప్రక్రియలో భాగంగానే స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మిస్తోందని శంకుస్థాపన కూడా చేసిందని పిటిషన్‌ దారులు ప్రస్తావించారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం వీఐపీల వసతి కోసం నిర్మిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దానిపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

30 ఎకరాలను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. గ్రేహౌండ్స్‌ పరిధిలో ఉన్న ఈ స్థలానికి అవసరమైన రికార్డులను రూపొందించాలని.. దీన్ని అత్యవసరమైన అంశంగా పరిగణించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పుడిదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇది కచ్చితంగా రాజధాని తరలింపు ప్రక్రియేననే చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజధాని తరలింపు వ్యవహారం కోర్టులకెక్కిన నేపథ్యంలో... స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం ఎపిసోడ్‌ ఎన్ని మలుపులు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.