ఏపీలో మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్

ఏపీలో మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్

మందుబాబులకు జగన్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మద్యం ధరలను రెండోసారి భారీగా పెంచేసింది జగన్ సర్కార్. కొత్త ధరలు బార్లు, స్టార్ హోటళ్లలో జరిగే మద్యం అమ్మకాలను పరిమితం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దీంతో మందుబాబులు బార్లకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడా రద్దీ పెరిగిపోయింది. ఇక...దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బార్లకు తాకిడి తగ్గించే పనిలో పడింది. బార్లలో విక్రయించే మద్యం ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు...ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర సమయపాలన విధించింది. అక్కడ కూర్చుని మందు కొట్టే అవకాశం లేకుండా పోయింది. బార్లకు అలవాటు పడిన మందుబాబులకు సర్కార్ నిర్ణయం కరెంట్ షాక్‌లా తగిలింది.

పెరిగిన ధరలను కేవలం బార్లకే పరిమితం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధర మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. బార్లలో మద్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇక...ప్రైవేట్ మద్యం షాపులను రద్దు చేసిన నెలల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల సమీక్షకు సిద్ధమైంది. ఈ ఏడాది జూలైలో సుమారు 37 లక్షల రూపాయలు చెల్లించి లైసెన్సులు పొందిన బార్ల నిర్వహకులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బార్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేస్తోంది. డిసెంబరు 31నాటికి ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులు రద్దయిపోతాయి. ఐతే ఆ తర్వాత కొత్తగా ఎలాంటి విధానం అనుసరిస్తారనే దానిపై ఇంకా స్పష్ట త లేదు.