ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూకు తొలి టెండర్

ఏపీ  జ్యుడీషియల్ ప్రివ్యూకు తొలి టెండర్

రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్ అయినా న్యాయపరమైన పరిశీలనకు వెళ్లాల్సిందేనని సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటించారు. అందుకు అనుగుణంగా న్యాయనిపుణులతో ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఏర్పాటైన తర్వాత తొలి టెండర్ పరిశీలనకు రానుంది. రాష్ట్రంలో 108, 104 వైద్య సేవల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించనుంది. వచ్చే టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో 108, 104 నిర్వహణ వివరాలను తెలియజేయాల్సిందిగా జ్యుడీషియల్ ప్రివ్యూ వైద్య ఆరోగ్యశాఖను కోరింది. ఒక్కో అంబులెన్స్  నిర్వాహణకు నెలకు సుమారు రూ. 1.35 లక్షలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో 600కు పైగా అంబులెన్సులు. మరో 700కు పైగా అంబులెన్సులను సిద్దం చేయాలని సర్కార్ భావిస్తోంది. అంబులెన్స్ నిర్వాహాణ అంచనా వ్యయం రూ. 100 కోట్లు దాటుతుండడంతో జుడిషియల్ ప్రివ్యూకు  సర్కార్ పంపింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్ పర్యవేక్షణలో జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగించనుంది.