ఏపీ స్థానిక ఎన్నికల అంశంలో నెక్స్ట్ ఏంటి ?

ఏపీ స్థానిక ఎన్నికల అంశంలో నెక్స్ట్ ఏంటి ?

ఏపీలో రాజకీయ పక్షాలన్నీ స్థానిక ఎన్నికలు జరపాలని కోరాయి. రాష్ట్రంలో ఒక్క అధికార పక్షం తప్ప అన్ని పార్టీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏంటంటూ అధికార పక్షం ప్రశ్నిస్తోంది. అసలు ఇలాంటి సమయం లో రాజకీయ పక్షాలతో సమావేశాన్నే అధికార పార్టీ తప్పు పట్టింది. అయితే రాజకీయ పక్షాలతో సమావేశం తరువాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోనూ ఎస్ ఇసి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితులు లేవని సిఎస్ చెప్పినట్లు గా తెలుస్తోంది.

కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో ఇప్పుడు ఎన్నికల ద్వారా పరిస్థితిని మళ్లీ ప్రమాదంలో నెట్టెయ్యలేమని ప్రభుత్వం చెపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఎన్నికలు పెట్టడం అనేది సాద్యం కాని వ్యవహారం. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు తమ వల్ల కాదంటూ ప్రభుత్వం చెప్పేసింది. మరి దీనిపై ఎన్నికల కమిషనర్ వెనక్కి తగ్గుతారా ? లేక మొండిగా ముందుకు వెళతారో చూడాలి. ఇదంతా ఇలా ఉంటే కోర్టుకు ఎన్నికలపై ఎస్ ఇసి తరుపున అభిప్రాయం చెప్పేందుకే మీటింగ్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

కోర్టులో ఇప్పటికే ఉన్న కేసుపై ఎన్నికల సంఘం తరుపున అభిప్రాయం చెప్పాలని...అందుకే రాజకీయ పక్షాలు, ప్రభుత్వంతో మీటింగ్ పెట్టామని ఎస్ ఇసి వర్గాలు చెపుతున్నాయి. రాజకీయ పార్టీలు అన్నీ డిమాండ్ చేసినా.....దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా....ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేక సార్లు కోర్టు ఆదేశాల ప్రకారమే జరిగాయి. మరి ఇప్పుడు కూడా బంతి కోర్టుల పరిధిలోకి వెళుతుందా లేక..ఇక్కడే నిర్ణయం జరుగుతుందా అనేది చూడాల్సి ఉంది.

ఎన్నికలు పెట్టాలని కొందరు....ఇప్పుడే వద్దని కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో నిమ్మగడ్డ నిర్ణయం ప్రకారం మరికొంత మంది కోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. దీంతో నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన ఎన్నికలు జరగవని కొందరు చెపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వల్ల కాదని చెప్పింత మాత్రాన ఎన్నికలు వాయిదా కుదరదనే వాదనా వినిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ వైసిపి అభ్యంతరాలను పట్టించుకోకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదని...కానీ నిర్వహణ బాద్యతలు చూడాల్సిన ప్రభుత్వం అభిప్రాయానికి భిన్నంగా వెళ్లే అవకాశం ఉండదనే వాదన ప్రదానంగా వినిపిస్తోంది.