అసలు డ్రోన్లు ఎందుకు వాడామంటే..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

అసలు డ్రోన్లు ఎందుకు వాడామంటే..? క్లారిటీ ఇచ్చిన మంత్రి

చంద్రబాబు నివాసం దగ్గర డ్రోన్ల వినియోగంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తన నివాసంపై డ్రోన్ల వినియోగంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయగా.. టీడీపీ నేతలు ప్రభుత్వ చర్యలను తప్పుబడుతున్నారు. అయితే, డ్రోన్ల వినియోగంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరద ప్రభావంపై అంచనా వేసేందుకు విజువల్స్ తీసుకుంటాం.. దాంట్లో భాగంగానే చంద్రబాబు ఇల్లు వచ్చిందన్నారు. కుషన్ పెట్టుకుని నీళ్లు వదలడం శాస్త్రీయంగా జరిగే ప్రక్రియ. దేవినేని ఉమ చెప్పినట్టుగా నీటిని వదిలితే ఒకేసారి 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చేదన్నారు అనిల్... టీడీపీ హయాంలో నీళ్లు రాకపోవడంతో నీటి నిర్వహణ చేయడం వారికి తెలియదని ఎద్దేవా చేసిన మంత్రి.. వరద వస్తుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ చక్కేశారని సెటైర్లు వేశారు. 

5 లక్షల క్యూసెక్కుల నీటికే చంద్రబాబు ఇంటిలోకి కొద్దిగా నీళ్లు వచ్చాయి... ఇంటిలోకి నీళ్లు రాకుంటే ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారు..? వరద నీరు ఇంటిలోకి రాకుండా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు..? అని ప్రశ్నించారు మంత్రి అనిల్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి ఏమైనా అయితే.. మళ్లీ మమ్మల్నే విమర్శిస్తారన్న ఆయన.. ఇదే నీరు చంద్రబాబు హయాంలో వస్తే హరతుల పేరుతో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టేవారని ఎద్దేవా చేశారు. వర్షాలు ఇక్కడ పడలేదు.. వేరే చోట పడ్డాయంటున్నారు.. ఎక్కడ నుంచి నీళ్లు వస్తే ఏంటీ..? డ్యాములు నిండాయా..? లేదా..? అని ప్రశ్నించారు. టీడీపీ దరిద్రం.. మిగిలిన ప్రాంతాలకు తాకింది. గత ఎన్నికల్లో బాబు ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్లు ఓడిపోయారని సెటైర్లు వేశారు మంత్రి అనిల్. ఉదయం నుంచి టీడీపీ అత్యుత్సాహంగా వ్యవహరిస్తోంది.. నీళ్లు ఇప్పుడు పుష్కలంగా వచ్చాయని టీడీపీ బాధ పడుతోంది.. చంద్రబాబు సీఎం అయితే నీళ్లు ఉండవనే నానుడి నిజమవుతుందనే ఆక్రోశం కన్పిస్తోందంటూ మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.