రాజధాని అమరావతి అవినీతి కూపంలా ఉంది

రాజధాని అమరావతి అవినీతి కూపంలా ఉంది

రాజధాని అమరావతి వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని వ్యవహారాలను  మరింత లోతుగా పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని ఆయన వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పరిహారంగా ప్రభుత్వం వారికి చేసిన ప్లాట్ల కేటాయింపుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని ఆయన స్పష్టం చేశారు. బలవంతపు భూసేకరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని బొత్స చెప్పారు. 

కొత్త ప్రభుత్వం ఇటీవలే ఏర్పడినందున.. తొలుత అవినీతి కూపం నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కుంభకోణం వివరాలు తేలాక రాజధాని అభివృద్ధి సంగతి చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణంలో ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని.. రూ.100తో అయ్యే పనికి రూ.150 ఖర్చు చేశారన్నారు. తమకు కావాల్సిన వాళ్లకు అనుకూలంగా.. పేదలకు మాత్రం ఇష్టారాజ్యంగా ప్లాట్లు కేటాయించారని చెప్పారు. ప్రజావేదిక నుంచే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైందని.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు.