రాజధాని రైతులకు సర్కార్ వరాలు...!

రాజధాని రైతులకు సర్కార్ వరాలు...!

మూడు రాజధానుల ప్రతిపాదనలతో ఓవైపు అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా... రైతులపై వరాలు కురిపించింది వైసీపీ సర్కార్... రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని.. దీనికంటే మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని ప్రకటించారు మంత్రి బొత్స.. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచబోతున్నామని వెల్లడించిన ఆయన.. రాజధానికి భూములు ఇచ్చిన పట్టారైతులతో సమానంగా అసైన్డ్‌ భూములు ఇచ్చిన అసైన్డ్‌ దారులకు రిటర్న్‌ ప్లాట్ల కేటాయిస్తామని తెలిపారు. 

ఇక, భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ.50 వేలు, మెట్టభూమికి అయితే రూ.30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలన్నది నిర్ణయం. అలాగే, ప్రతి ఏటా జరీబుకు రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని.. ఈ యాన్యునిటీని 10 సంవత్సరాలనుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు బొత్స. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.1 లక్ష రూపాయలు, మెట్టభూమికి రూ.60వేలు అవుతుందని.. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్లపాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామిన స్పష్టం చేశారు. కాగా, ఓవైపు అసెంబ్లీ జరుగుతుండగా.. మరోవైపు అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారు రైతులు.. రోడ్లుఎక్కి ఆందోళనకు దిగారు. మరి మంత్రి ప్రకటన తర్వాత రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి.