బొత్స యూటర్న్..!? నేను అది మాత్రమే చెప్పా..!

బొత్స యూటర్న్..!? నేను అది మాత్రమే చెప్పా..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇక ఏపీ కేపిటల్ తరలిపోతోందనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అయితే, తన వ్యాఖ్యలపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ.. రాజధానిపై తన వ్యాఖ్యలు వక్రీకరించారని మీడియా చిట్‌చాట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో వరదల గురించి మాత్రమే తాను మాట్లాడానన్నారు. పదేళ్ల క్రితం 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తే.. ఆ ప్రాంతం అతలాకుతలమైందని గుర్తుచేశారు. మొన్న 8 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని చెప్పుకొచ్చారు. 

శివరామకృష్ణ కమిటీ రిపోర్టు కాకుండా.. నారాయణ రిపోర్టును అమలు చేశారని ఆరోపించారు మంత్రి బొత్స. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని.. అమరావతి చుట్టూ టీడీపీ నేతల రియల్ వ్యాపారం ఉందిగనుకే.. భయపడుతున్నారని మండిపడ్డారు. చెన్నై, ముంబై ఎప్పుడో కట్టిన రాజధానులని వాటితో అమరావతికి పోలికేంటని ఎద్దేవా చేశారు. ముంపునకు గురవుతాయని తెలిస్తే.. అక్కడ రాజధానులు కట్టేవారా? అని నిలదీశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంపై మేనిఫెస్టోలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదనే విషయాన్ని గుర్తు చేస్తూనే.. 25 శాతం కంటే తక్కువ అయిన పనులను మాత్రమే నిలిపివేశామని.. మిగతా పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. అయితే, రాజధాని వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుందన్నారు. రాజధానిని తరలిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు.. కానీ, మేం రాజధాని తరలింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.