పోలవరంపై లోటస్ పాండ్ కేంద్రంగా కుట్రలు

పోలవరంపై లోటస్ పాండ్ కేంద్రంగా కుట్రలు

పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు లోటస్‌పాండ్‌ కేంద్రంగా కేసీఆర్‌, జగన్‌ కుట్రలు పన్నుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వేల మంది కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోలవరం పనులు చేస్తుంటే.. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదే పదే ఉత్తరాలు రాసే కేవీపీ, ఉండవల్లి... జగన్‌కి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆరోపించారు. జగన్‌పై ప్రేమ ఉంటే వైసీపీలో చేరాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్‌ సుప్రీంకోర్టుని, ఆయన కుమార్తె కవిత జాతీయ హరిత ట్రైబ్యునల్‌ని ఆశ్రయించినప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. పోలవరానికి రావాల్సిన నిధులను కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని నుంచి సాధించుకుంటామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రధాని మోడీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు తీరికలేకుండా పోయిందని మంత్రి దేవినేని విమర్శించారు.