ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు జగన్ కుట్రలు 

ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు జగన్ కుట్రలు 

ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని జగన్‌ కోట్లు ఖర్చు పెట్టారని.. ఆయన కుట్రలకు అడ్డులేకుండా పోతోందన్నారు. ప్రశాంత్‌కిషోర్‌, జగన్‌, విజయసాయిరెడ్డి పాపాలు బయటకు రావాలని అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని... ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో వైసీపీ గెలవాలని... కేవీపీ కుట్రలు పన్నారని ఉమ ఆరోపించారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేవీపీ అంటున్నారని.. అయితే పోలవరానికి సంబంధించిన సమాచారమంతా ఆన్‌లైన్‌‌లో ఉందన్నారు. కేవీపీపై అమెరికాలో చాలా కేసులు ఉన్నాయని దేవినేని ఉమ ఆరోపించారు.

ఈవీఎంలకు మరమ్మతులు చేయాలని లేదంటే కొత్తవి పెట్టాలి. మరమ్మతుల కోసం ఆరు గంటల సమయం తీసుకున్నారు. ఒక ఈవీఎం స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడానికి ఆరు గంటల సమయం అవసరమా? ఈవీఎంలు పాడైపోతే మళ్లీ వచ్చి పోలింగ్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి. ఈసారి కేంద్రంలో కొత్త ప్రధాని రావడం ఖాయం. దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారు. అవినీతి పరులతో వైసీపీ కౌంటింగ్ శిక్షణ ఇప్పించింది. చంద్రగిరిలో రీ పోలింగుకు 34 రోజుల తర్వాత ఆదేశాలు ఇవ్వడమేంటీ..? అవినీతి పరులను అందలమెక్కించేందుకే రీ-పోలింగ్ కుట్రలు. తుని రైలు ఘటన నుంచి ఈవీఎంల వ్యవహారాల వెనుక పీకే కుట్ర ఉంది అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.