టీడీపీ గెలుస్తుంది.. ఇది పీకే టీమ్‌ మాట!?-దేవినేని

టీడీపీ గెలుస్తుంది.. ఇది పీకే టీమ్‌ మాట!?-దేవినేని

ఎన్నికల సమయంలో ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీనే విజయం సాధిస్తుందన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు వైఎస్ జగన్ రూ. 300 కోట్లు ప్రశాంత్ కిషోర్ టీమ్ కోసం ఖర్చు చేశారని విమర్శించిన ఆయన.. పీకే టీమ్‌లోని సిబ్బంది తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి రాబోతోందని చెబుతున్నారని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ బహిర్గతమైందన్నారు. ఇక దేశ రాజధానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాటం దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలని చైతన్యపరిచిందన్న దేవినేని.. ఎన్నికల నిర్వహణ తీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గం కొటికలపూడిలో మర్నాడు ఉదయం 5 గంటల వరకు పోలింగ్ జరిగినట్టు వెల్లడించిన మంత్రి.. సీఎం చంద్రబాబు పిలుపునందుకుని టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మహిళలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు ఆరు ఏడు గంటల పాటు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారని.. ఓట్లు వేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్ ఉమ్మడి కుట్రలను ఆగ్రహించిన రాష్ట్ర ప్రజానీకం టీడీపీకి అండగా నిలిచారన్నారు. 

ముఖ్యమంత్రి పదవి వ్యామోహం తప్ప జగన్ కు రాష్ట్ర ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు దేవినేని ఉమా.. సీఎం నేమ్ ప్లేట్ తయారుచేయించుకుని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కడం కష్టమేనన్న ఆయన.. జగన్ ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా భ్రమల్లో బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా మునుపెన్నడూ లేనివిధంగా అరాచకాలు సృష్టించారు. ప్రశాంత్ కిషోర్ మార్గదర్శకత్వంలో బీహార్ తరహా అరాచకాలను ఏపీలో సృష్టించాలని కుట్రలు పన్నారని ఆరోపించిన ఆయన.. లోటస్ పాండ్ కేంద్రంగా కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు జగన్ పనిచేస్తున్నాడని విమర్శించారు. దేశంలో బీజేపీయేతర పార్టీలు లేకుండా చేయాలని నియంతృత్వధోరణితో మోడీ కుట్రలు పన్నుతున్నారు.. తెలుగువాళ్లు ఎక్కడున్నా తెలుగుజాతి ప్రయోజనాల కోసం తిరగబడాలని పిలుపునిచ్చారు దేవినేని ఉమామహేశ్వరరావు.