కోడెల ఫర్నిచర్ ఎందుకు ఇంటికి తీసుకెళ్లారు..?

కోడెల ఫర్నిచర్ ఎందుకు ఇంటికి తీసుకెళ్లారు..?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఎందుకు ఇంటికి తీసుకెళ్లారు..? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి కన్నబాబు. పోలీసు విచారణ జరుగుతుందని తెలిసి ఇప్పుడు తీసుకెళ్లమని అంటున్నారు. స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పులు చేస్తే ప్రజలు ఏమనుకుంటారు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండి జలకళ సంతరించుకుంది.. అయినా, రాయలసీమలో చాలా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. కృష్ణానది వరదలతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో.. గోదావరి వరదలతో ఉభయగోదావరి జిల్లాల్లో పంట నష్టం జరిగిందన్నారు.

కృష్ణా జిల్లాలో 4385, గుంటూరు జిల్లాలో 5600, తూ.గో. జిల్లాలో 4968, ప.గో. జిల్లాలో 4375 హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని వివరించిన మంత్రి కన్నబాబు.. రైతులకు 100 శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా.. ప్రభుత్వం పై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకూ డ్రోన్ రాజకీయం చేశారు. ఇంత పెద్ద వరద వస్తే పూజలు పేరుతో చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టేవారంటూ ఎద్దేవా చేశారు మంత్రి కన్నబాబు.