కాలక్షేపం డ్రామాలు చాలు-లోకేష్

కాలక్షేపం డ్రామాలు చాలు-లోకేష్

లోక్ సభలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ లో కేంద్రంపై నిప్పులు చెరిగారు. కబుర్లతో కాలక్షేపం చేసే డ్రామాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి తెలుగువాడు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని లోకేష్ చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుతారని 2014లో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరామన్నారు. ఎంతో కాలం ఓపికగా వేచి చూసి.. ఎన్నోసార్లు వేడుకున్నామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా 30 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. ఇంత చేస్తే దక్కింది శుష్క వాగ్దానాలు, డొల్ల హామీలు, నకిలీ నవ్వులని మండిపడ్డారు. అంతకు మించి ముందుకు కదల్లేదు. ఏం జరగలేదు. చంద్రబాబు లేకుంటే మీరు చేసిన పనికి ఏపీ తల్లిదండ్రులు లేని అనాథగా మారేదని లోకేష్ ట్వీట్ చేశారు.