కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదు

కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదు

కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదు అని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నారన్నారు. బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం దారుణం అని ధ్వజమెత్తారు. గవర్నర్ కు ఉన్న విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారు అని.. విచక్షణాధికారం అంటే పక్షపాతంతో వ్యవహరించేది కాదని తెలిపారు. బీజేపీ నాయకులు భారత రాజ్యాంగాన్ని పట్టపగలే హత్యచేశారు అని ఎద్దేవా చేశారు యనమల. భారత రాజ్యాంగానికి బీజేపీ ద్రోహం చేసింది, కొనుగోళ్లకు అవకాశం  కల్పించారన్నారు. కర్ణాటకలో బీజేపీకి సంఖ్యాబలం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం గోవా, మేఘాలయ, మణిపూర్ లలో ఒకరకంగా వ్యవహరించి.. కర్ణాటకలో మరో రకంగా వ్యవహరించడం సరైన విధానం కాదు అని తీవ్రంగా మండిపడ్డారు. రేపటి బలపరీక్షకు.. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు యనమల. కర్ణాటక గవర్నర్ తప్పును కొంతమేర సుప్రీంకోర్టు చక్కదిద్దిందన్నారు.