ఓట్ల తొలగింపులో వైసీపీ అక్రమాలు: ఈసీకి ఏపీ మంత్రుల ఫిర్యాదు

ఓట్ల తొలగింపులో వైసీపీ అక్రమాలు: ఈసీకి ఏపీ మంత్రుల ఫిర్యాదు

ఆన్ లైన్ ద్వారా ఓట్ల తొలగింపు వ్యవహారంలో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని 10 మంది ఏపీ మంత్రులు మంగళవారం అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఫారం-7 దరఖాస్తులను వైసీపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ మంత్రులు సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. దురుద్దేశంతో ఓట్లను తొలగించమని ఫాం-7 దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒక క్రిమినల్ కి ఎలాంటి ఆలోచనలు వస్తాయో వైసీపీ అలా ఆలోచిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఓవైపు ఓట్ల తొలగింపునకు తామే ఫారమ్-7 దరఖాస్తు చేశామని చెప్పిన వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉందని విమర్శించారు.  తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ తో కలిసి కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఓట్ల తొలగింపునకు ఫారం-7 దరఖాస్తు చేసినవారికి శిక్ష పడేవరకు తాము పోరాడతామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు తమపై కేసులు పెట్టే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.

ఏపీ డేటా ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉందని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. సైబరాబాద్ సీపీ వ్యాఖ్యలు ఖండించిన ఆయన, ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 100కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులో జగన్, విజయ సాయిరెడ్డిలు ముద్దాలుగా మిగలడం ఖాయమని మంత్రి నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. మోడీ ముసుగు తీస్తే కేసీఆర్, కేసీఆర్ ముసుగు తీస్తే జగన్ కనిపిస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. బూత్ కన్వీనర్ల ద్వారా వైసీపీయే గంపగుత్తగా ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు. వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్ల పేర్లతో తొలగింపునకు దరఖాస్తు చేశారని తెలిపారు. దొంగే దొంగ అన్నట్లు ఢిల్లీలో ఓట్ల తొలగింపు అంటూ ఫిర్యాదు చేశారని ఆరోపించారు. టెక్నాలజీ సాయంతో ఫారం 7 దరఖాస్తు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్టు చెప్పారు.