విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

వర్చువల్ విధానంలో ఏపి పోలీసు డ్యూటీ మీట్ ను తిరుపతిలో ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్యూటీ మీట్ మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.  సైబర్ టెక్నాలజీ, మహిళల రక్షణ మీద దృష్టి సారించబోతున్నారని...పోలీసు శాఖ మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు 'ఇగ్నైట్' దోహదపడాలని తెలిపారు.  పోలీస్ స్టేషనుకు వచ్చిన ప్రజల మొహాలలో చిరు నవ్వులు చూడగలుగుతున్నామా అన్నదానికి ఇగ్నైట్ మార్గం చూపాలన్నారు. ఏపీలో దురదృష్టకరంగా రాజకీయాలు మారాయని...18 నెలల కాలంలో ఏ వ్యత్యాసం లేకుండా పాలన సాగిస్తుంటే ప్రతిపక్షానికి కంటకమైందని ఫైర్‌ అయ్యారు. ఓర్వలేక కుయుక్తులు, కుట్రలు చేస్తున్నారని....సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు చూస్తుంటే కలియుగంలో క్లైమాక్స్  వస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. దేవుడంటే భయం లేకుండా పోతోందని.... దేవున్ని కూడా రాజకీయాలలోకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు‌. ఎక్కడో మారు మూల ప్రాంతాలలో గుళ్ళలో విగ్రహాలను ఎంచుకుని ధ్వంసం చేస్తుంటే, అక్కడ ప్రతిపక్షాలు ఆగడాలు చేస్తున్నారని... అలాంటి కేసులను కూడా సమర్థవంతంగా తేల్చగలగాలని సూచించారు.  

దేవుడి విగ్రహాలు కూల్చితే ఎవరికి లాభం..ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గులకు పాల్పడుతున్నారో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.  ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం జరిపితే.. పబ్లిసిటీ వస్తుందని... దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘటనలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. 2019 లో నాడు-నేడుకు ప్రాధాన్యత వస్తుందని తెలిసి దుర్గ గుడి ధ్వంసం అని దుష్ప్రచారం చేసారని....2020 జనవరిలో రైతులకు ధరల స్థిరీకరణ చేస్తే ఆంజనేయ స్వామి గుడి ధ్వంసం అని దుష్ప్రచారం చేసారని గుర్తు చేశారు. దిశ పోలీస్ స్టేషన్ పబ్లిసిటీని అడ్డుకోవడం కోసం రధం కాలిపోయిందని ప్రచారం చేశారన్నారు. మహిళల సంపూర్ణ వికాసం కార్యక్రమం చేస్తే అంతర్వేది రధం కాలిందని ప్రచారం చేసారని మండిపడ్డారు. రైతు జలసిరి కార్యక్రమం మొదలు పెడితే నెల్లూరులో ఓ ఆలయంలో విగ్రహం ధ్వంసం చేశారని... బిసిలకు చారిత్రాత్మక చర్యలు చేపడితే వీరభద్ర స్వామి ఆలయం ధ్వంసం అన్నారని మండిపడ్డారు. ఇంటి పట్టాలు ఇస్తావుంటే తిరుమల ఆలయంలో పూర్ణకుంభం లైటింగ్ లో శిలువ అని ప్రచారం చేసారని.. విజయనగరంలో ఇంటి పట్టాలు ఇస్తున్నామని తెలిసి రాముల వారి ఆలయంలో దాడి చేశారని ఫైర్‌ అయ్యారు జగన్‌. ఎండోమెంట్ పరిధిలోకి కూడా రాని ఆలయాలు తెలుగుదేశం నేతల పర్యవేక్షణలో ఉన్నవాటిలో ఈ ఘటనలు చేస్తున్నారని.. పొలిటికల్ గొరిల్లా వార్ జరుగుతోందని తెలిపారు.