సీఎంగా ఉండేవారికి దమ్ముండాలి !

సీఎంగా ఉండేవారికి దమ్ముండాలి  !

 

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తన సొంత నియోజకవర్గంలో నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్లు అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎంపికయిన వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సీఎంగా ఉన్న వ్యక్తికి దమ్ముండాలని, జగన్ లో ఆ దమ్ముంది కాబట్టే సామాజిక న్యాయంతో చట్టాలు చేయగలిగారని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మాటకు కట్టుబడి మనసుతో పరిపాలన సాగిస్తున్నారని తమ్మినేని తెలిపారు. వాలంటీర్ల ఎంపిక విషయంలో టీడీపీ పిటిషన్లు వేసినా ఎవరూ భయపడవద్దని అన్నారు.

ఆగస్టు 18 తర్వాత గ్రామాల్లో ఆయా ఎమ్మెల్యేలు పర్యటిస్తారని గ్రామవాలంటీర్ల వ్యవస్థ, పనితీరును ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి ఇతర రాష్ట్రాలే కాకుండా, అనేక దేశాల నుంచి ఆసక్తి వ్యక్తమవుతోందని, శ్రీలంక, మలేసియా దేశాలు కూడా సచివాలయ వ్యవస్థను పరిశీలిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే తమ తమ నియోజకవర్గాల్లోని వాలంటీర్లకు ఎమ్మెల్యేలు సూచనలు, సలహాలు ఇస్తారని, వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.