నేడు మంత్రి అఖిల ప్రియ వివాహం

నేడు మంత్రి అఖిల ప్రియ వివాహం

ఈ రోజు ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వివాహం జరగనుంది. పారిశ్రామికవేత్త మద్దూరు భార్గవ్ రామ్ నాయుడుతో అఖిలప్రియ వివాహం ఉదయం 10:57 గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది. కర్నూలులోని కోటకందుకూరు మెట్టు వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ వివాహం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మంత్రి భూమా అఖిల ప్రియ, పెళ్లికుమారుడు భార్గవ్‌రామ్‌ల మెహందీ వేడుకలు జరిగాయి. ఈ వివాహంకు సీఎం చంద్రబాబు, ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. 

ఈ వివాహంకు రెండు రాష్ట్రాల ప్రముఖులందరికీ ఆహ్వానం అందింది. ఈ వివాహానికి ప్రముఖులతో పాటు భూమా అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఏర్పాట్లను భారీ ఎత్తున చేస్తున్నారు. మరోవైపు ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మామ ఎస్వీ మోహన్‌రెడ్డి, అన్నయ్య భూమా బ్రహ్మానందరెడ్డి పెళ్లి వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.