విజయసాయికి కర్ణాటకలో ఏం పని?:సోమిరెడ్డి

విజయసాయికి కర్ణాటకలో ఏం పని?:సోమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చినా తాము పోటీకి సిద్దమే అని ఆ రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. ఈరోజు సోమిరెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ..  ముందస్తు ఎన్నికలు వచ్చినా లేదా  ఉప ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. వైకాపా ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదిస్తే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నిన్న పార్టీ సమావేశంలో అన్నారు. ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ....ఏ ఎన్నికలకైనా తాము రెడీగా ఉన్నామన్నారు. ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకుని రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా వైకాపా చూస్తోందని సోమిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదంటూ.. ఎన్నికలలో ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని చూస్తోందన్నారు.  ప్రణాళిక ప్రకారం బీజేపీతో కలిసి  జగన్‌ ప్లాన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.  కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం వైకాపా కృషి చేస్తోందంటూ కర్ణాటకలో ఆ పార్టీ ఎంపీ విజయసాయి  రెడ్డికి  ఏం పని అని ఆయన ప్రశ్నించారు.  విజయ సాయిరెడ్డి కర్ణాటకలో బీజేపీ గెలుపు కోసం పనిచేస్తూ.. రాష్ట్రంలో మాత్రం ప్రత్యేక హోదా సాధిస్తామని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.  రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి జగన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని  విమర్శించారు.  తిరుపతిలో జరిగిన ఘటనను సొంతమీడియా ద్వారా పదేపదే చూపిస్తూ.. బీజేపీని  వైకాపా రెచ్చగొడుతోందని  సోమిరెడ్డి మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కోలేని ప్రధాని.. దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళతారని సోమిరెడ్డి  ప్రశ్నించారు.