ఉత్తరాంధ్ర నోట్లో మట్టికొట్టారు: రఘువీరా

ఉత్తరాంధ్ర నోట్లో మట్టికొట్టారు: రఘువీరా

విశాఖలో ఎస్పీజీ బలగాల నడుమ ప్రధాని మోడీ బహిరంగ సభ పెట్టుకోవడం సిగ్గుచేటని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే జోన్ ప్రకటించి ప్రజలను అపహాస్యం చేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల నోట్లో మట్టికొట్టారని మండిపడ్డారు. మోడీ సభకు నిరసన తెలిపిన అన్ని పార్టీలను అభినందిస్తున్నానని తెలిపారు. సైనికుల త్యాగాలను రాజకీయాలకు వాడుకోవడం తప్పని అన్నారు. పాక్ పై భారత్ జరిపిన మెరుపుదాడులతో 22 సీట్లు పెరుగుతాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అనడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రధాని మోడీకి ఎందుకు నిరసన తెలపలేదని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏంటో బయటపెట్టాలని అన్నారు. 

బీజేపీ హామీలన్నీ అబద్ధాలే. పొలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ అని బీజేపీ ప్రకటించిందని అనడం సిగ్గుచేటు. లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేతులు మార్చుకున్న పార్టీ బీజేపీ. అమిత్ షా, ఆయన కొడుకు చేసిన అవినీతిని వదిలేశారు. అప్పటి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దళితుడు కాబట్టి అవినీతి పరుడని చెప్పి అవమానపరిచారు. ఆ అవమాన భారంతో లక్ష్మణ్ మృతి చెందారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని బహిష్కరించాలని రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు.