ప్రత్యేక హోదా రావాలనేదే తమ లక్ష్యం

ప్రత్యేక హోదా రావాలనేదే తమ లక్ష్యం

2019లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనేదే తమ లక్ష్యమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. పలువురు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ.. హోదా రావాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించాల్సిన రాజకీయ  విధానంపై రాహుల్‌తో లోతుగా చర్చించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నేతలతో, పార్టీ సీనియర్లతో సేకరించిన అభిప్రాయాలను  రాహుల్ ముందు పెట్టామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ నిర్ణయాత్మక శక్తిగా ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఏ విధంగా ముందుకెళ్తుందో, ఏ పార్టీలతో పొత్తులు ఉంటాయనేది వారం రోజుల్లో తెలుస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. పొత్తులపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని మరోసారి ఉద్ఘాటించారు. అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.