మొండి పట్టుదలకు పోవద్దు సీఎంగారూ..

మొండి పట్టుదలకు పోవద్దు సీఎంగారూ..

కోల్ కతాలో డాక్టర్లపై దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వేలాది డాక్టర్లు సమ్మెకు దిగడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శుక్రవారం ఈ అంశాన్ని ప్రతిష్ఠకు సవాల్ గా తీసుకోవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సూచించారు. ఇవాళ ఎయిమ్స్, ఇతర అత్యున్నత ఆస్పత్రులకు చెందిన డాక్టర్ల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. డాక్టర్లకు మెరుగైన పని వాతావరణం, రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. ఇందులో వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ప్రస్తుత ప్రతిష్ఠంభనను తొలగించే విధంగా పరిష్కారం కనుగొనాలని మమతా బెనర్జీకి ఆయన స్వయంగా లేఖ రాశారు. 

'దీనిని ప్రతిష్ఠకు సవాలుగా తీసుకోవద్దని నేను చేతులు జోడించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేస్తున్నాను. దారుణంగా దెబ్బలు తిన్నప్పటికీ డాక్టర్లు కేవలం తగిన రక్షణ కల్పించమని, చట్టప్రకారం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని మాత్రమే కోరారు. ఆమె అలా చేయకపోగా వారిని బెదిరించారు. దీంతో పశ్చిమ బెంగాల్ తో పాటు దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆగ్రహించి సమ్మెకు దిగారు. సీఎం తన వైఖరి మార్చుకొంటే దేశవ్యాప్తంగా రోగులు ఇబ్బందులు పడరని' హర్షవర్ధన్ అన్నారు.

నిరసనను సంకేతప్రాయంగా తెలియజేయాలని, విధుల్లో చేరి సేవలు కొనసాగించాల్సిందిగా డాక్టర్ హర్షవర్ధన్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో 100 మంది డాక్టర్లు రాజీనామా చేశారు.