యాపిల్‌ ఇన్వెస్టర్లకు కనకవర్షం

యాపిల్‌ ఇన్వెస్టర్లకు కనకవర్షం

ఈఏడాది రెండో త్రైమాసికంలో కూడా మార్కెట్‌ అంచనాలకు మించి పనితీరు కనబర్చిన యాపిల్‌ కంపెనీ తన ఇన్వెస్టర్లకు భారీ బొనంజా ప్రకటించింది. సుమారు వంద బిలియన్‌ డాలర్లు (రూ. 6,66,550 కోట్లు) తో షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించడంతో పాటు ఇన్వెస్టర్లకు 16 శాతం డివిడెండ్‌ ప్రకటించింది. యాపిల్‌ అనూహ్య ప్రకటనతో కంపెనీ షేర్‌ భారీ లాభాలతో ట్రేడ్‌ అవుతోంది.

నిన్న ట్రేడింగ్‌ సమయంలో 2.32 శాతం లాభపడిన యాపిల్‌ షేర్‌, ఇవాళ ప్రిమార్కెట్‌లో దాదాపు 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. గడచిన రెండేళ్ళలో యాపిల్‌ షేర్‌ 80 శాతం పెరిగింది. మార్చితో ముగిసిన రెండో త్రైమాసికంలో 6110 కోట్ల డాలర్ల ఆదాయం ప్రకటించింది. ఒక్కో షేర్‌ పై 2.70 డాలర్ల లాభం ప్రకటిస్తామని చెప్పిన కంపెనీ... రాత్రి 2.73 డాలర్ల ఈపీఎస్‌ను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో కూడా 5100 నుంచి 5300 కోట్ల డాలర్ల ఆదాయం ప్రకటించగలమని యాపిల్‌ పేర్కొంది.