టీఎస్‌ఆర్టీసీ సమ్మె.. పండగ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ..!

టీఎస్‌ఆర్టీసీ సమ్మె.. పండగ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ..!

ముందే నోటీసులు ఇచ్చినా.. దసరా పండగ ముందు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ మాత్రం దసరా పండగను అదిరిపోయేలా చేసుకుంది. దసరా పండగ సీజన్‌లో ఏపీఎస్ ఆర్టీసీకి లాభాల పంట పడిందని లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ దసరా సీజన్‌లో అదనంగా రూ. 20 కోట్లు.. మొత్తంగా రూ. 229 కోట్ల ఆదాయం వచ్చిందని చెబుతున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. దసరా పండగ సందర్భంగా స్పెషల్ సర్వీసులు, రెగ్యులర్ బస్సులకు మంచి డిమాండ్ ఉండటంతో ఆక్యుపెన్సీ రేషియో 103 శాతానికి చేరిందని వెల్లడించారు. 

ముఖ్యంగా దసరా పండగ సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఆక్యుసెన్సీ ఘననియంగా పెరిగిపోయింది.. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు మొత్తం 5,887 ప్రత్యేక సర్వీసులను నడిపింది ఏపీఎస్ఆర్టీసీ.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా ఏపీఎస్ఆర్టీసీ బాగా కలిసివచ్చింది. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సమయంలో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తుంటారు.. వీరంతా ఏపీఎస్ఆర్టీసీనే ఆశ్రయించడం కూడా వారికి కలిసివచ్చింది. సాధారణంగా నిత్యం దాదాపు 40 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆంధ్ర ఆర్టీసీ బస్సులు, దసరా సీజన్‌లో మాత్రం రోజుకు 75 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చడం విశేషం.