ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం

ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం

ఏపీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. గురువారం విజయవాడలో కార్మికులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఎంతోకాలంగా తన న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతున్నట్లు.. వీటిని తీర్చేందుకు యాజమాన్యం శ్రద్ధ చూపడంలేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. వీటిపై యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె తేదీని ప్రకటించారు. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి సరైన హామీ లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. కార్మికుల వేతన సవరణ బకాయిల చెల్లింపు సహా 26 డిమాండ్ల పరిష్కార ప్రధాన డిమాండ్‌‌తో పాటు అద్దెబస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

'ఈరోజు మూడు గంటలుకు పైగా చర్చలు జరిగాయి. ఆర్టీసీ సిబ్బందిని తగ్గించి నష్టాలను పూడ్చాలని చూడటం సరికాదు. జూన్ 13 నుంచి సమ్మెకు వెళుతున్నాం. సమ్మె తేది గడువు పెంచమని అధికారులు కోరారు. ఈ ప్రతిపాదనను జేఏసీ తిరస్కరించింది. 53,500 అర్టీసీ సిబ్బంది సమ్మెకు వెళతారు. 9వ తేది నుంచి కార్మికులు వారి పనిగంటలలో మాత్రమే పనిచేస్తారు. ఇక నుంచి డబల్ డ్యూటీలు చేయరు. జూన్ 12వ తేది నుంచి దూర ప్రాంత సర్వీసులు ఆపివేస్తాము. 26 డిమాండ్లు పరిష్కరించమని డిమాండ్ చేశాం. అప్పులకు రోజుకు కోటి రూపాయలను సంస్థ వడ్డీ కడుతోంది. 70 లక్షల మంది ప్రజలు రోజూ ఆర్టీసీలో సేవలు ఉపయోగించుకుంటున్నారు. రూ.3,700 కోట్లు అర్టీసీ కేటాయించి ప్రభుత్వం సహకరించాలి. ప్రభుత్వం చర్చలకు  ఆహ్వానిస్తోందని ఆశిస్తున్నాం. సీఎంను త్వరలోనే కలిసి సంస్థ పరిస్థితి వివరిస్తాం. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుంటుందని విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా సిబ్బంది కుదింపును వ్యతిరేకిస్తున్నాం' అని ఈయూ నాయకుడు దామోదర్ తెలిపారు.