ఆర్టీసీలో సమ్మె సైరన్..!

ఆర్టీసీలో సమ్మె సైరన్..!

ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగేలా ఉంది. వేతన సవరణ పై గుర్తింపు కార్మిక సంఘం, యాజమాన్యం మధ్య విజయవాడలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో 8 కార్మిక సంఘాలు ఏకమై సమ్మెకు సిద్దమవుతున్నాయి. వీరికి అధికారుల సంఘం కూడా మద్దతు పలుకుతుంది. ఆర్టీసీలోని 52వేల మంది కార్మికులకు 2017 ఏప్రిల్ 1న వేతన సవరణ చేయాల్సి ఉంది. 21 నెలలుగా జాప్యం చేస్తున్న యాజమాన్యం గుర్తింపు సంఘమైన ఎన్ఎంయూ ఒత్తిడితో 19 శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది. ఈయూ నేతలతో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. డిసెంబర్ 31న ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. పలు దఫాలుగా జరుగుతున్న చర్చలు మంగళవారం మరోసారి జరిగాయి. 15 నుంచి20 శాతం షిట్ మెంట్ కు యాజమాన్యం ప్రతిపాదించింది. ఆర్ధిక ఇబ్బందులు, డీజిల్ ధరల పెరుగుదల, అప్పులకు వడ్డీలు అన్ని కలిపి రూ. 3,720 కోట్లు ఆర్టీసికి అవసరమని ఎండీ సురేంద్రబాబు తెలిపారు. సంస్థ నష్టాలకు కార్మికులు కారణం కాదని, ప్రభుత్వ నిర్ణయాల వల్లే ఆర్టీసీ నష్టాల్లో ఉందని నేతలు తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారైనందున యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో సమ్మెబాట పట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి.