మీటూలో పేర్లు చూసి షాకైన రహమాన్
దేశంలో మీటూ ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. అన్ని రంగాలలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత మహిళలు తాము అనుభవించిన మానసిక క్షోభను సోషల్ మీడియా ద్వారా ధైర్యంగా చెబుతున్నారు. ఇక దక్షిణాది సినీ రంగానికొస్తే..గాయని చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తు పై చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా మీటూ ఉద్యమంపై ప్రముఖ సంగీత దర్శకుడు, మొజార్ట్ ఆఫ్ మద్రాస్ ఏఆర్ రెహ్మాన్ ట్వీట్ చేశారు. మీటూపై ఆస్కార్ పురస్కార గ్రహీత రహమాన్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా మీటూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. అందులో కొందరి పేర్లను విని నేను చాలా షాక్‌కి గురయ్యాను. నాకు క్లీన్ ఇమేజ్ ఉన్న, మహిళలను గౌరవించే ఇండస్ట్రీని చూడాలని ఉంది. తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టేందుకు ముందుకు వస్తున్న మహిళలకు మనం అండగా నిలబడాలి. వారికి మరింత శక్తినివ్వాలి. మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు మేమంతా కృషి చేస్తాం. బాధితులు తమ బాధను వ్యక్తం చేసేందుకు సోషల్ మీడియా మంచి వేదికని కల్పిస్తోంది. ఒకవేళ అది దుర్వినియోగమైతే..?? మనం కొత్త ఇంటర్నెట్ జస్టిస్ సిస్టమ్‌ను క్రియేట్ చేయడంతో జాగ్రత్త వహించాలి’ అని రహమాన్ ట్వీట్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)