అరణ్య నన్ను మార్చేసింది: రానా

అరణ్య నన్ను మార్చేసింది: రానా

రానా దగ్గపాటి ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. రానా తన ప్రతి సినిమాను ఓ ప్రయోగంలా సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ప్లాన్ చేస్తారు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రానా నటించిన తాజా సినిమా అరణ్య. ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ఏనుగుల ప్రాధాన్యాన్ని చూపుతూ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌లో రానా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు.అరణ్య సినిమా తనను మనిషిగా మార్చిందని, ఏనుగులు నాకెంతో నేర్పించాయని రానా అన్నారు. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు అరణ్య. ఈ సినిమా కోసం మేము దాదాపు మూడు సంవత్సరాలు చిత్రీకరించాం. ఇందులో అరణ్య అడవిని కాపాడుతుంటాడు. నా పాత్ర జాదవ్ పయేంగ్ ఆధారంగా పుట్టింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఏనుగులు నాకు ఎంతో నేర్పించాయి. మనం భూమిని కాపాడుకుంటే, భూమి మనల్ని కాపాడుతుంది. ప్రతి సినిమా నుంచి మేము ఎదో ఒకటి నేర్చుకుంటాం. కానీ ఈ సినిమా నన్ను మనిషిగా మార్చింది. మనమందరం (మనుషులు, జంతువులు) ప్రకృతిలో భాగమే, అందరం కలిసి ఉండాలి. అలా కాదని ప్రకృతికి కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో మన మందరం చూశామ’ని రానా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అడవిలో చిత్రీకరణ మొదలు పెట్టినప్పుడు దాదాపు ఏడాది పాటు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో వారికి తెలియలేదని అన్నారు.