పాకిస్థాన్ లో 5 స్టార్ హోటల్ లోకి ఉగ్రవాదుల చొరబాటు

పాకిస్థాన్ లో 5 స్టార్ హోటల్ లోకి ఉగ్రవాదుల చొరబాటు

పాకిస్థాన్ లో ఉగ్రవాదంతో అట్టుడికే బెలూచిస్థాన్ ప్రాంతంలోని రేవు పట్టణం గ్వాదర్ లో ఒక 5 స్టార్ హోటల్ లోకి కొందరు సాయుధులైన ఉగ్రవాదులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఉగ్రవాదులు ఒక సెక్యూరిటీ గార్డుపై కాల్చి చంపినట్టు సైన్యానికి చెందిన మీడియా విభాగం నుంచి సమాచారం అందింది. ఆ సెక్యూరిటీ గార్డు వాళ్లను అడ్డుకొనే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.


పర్ల్ కాంటినెంటల్ హోటల్ లోకి ముగ్గురు లేదా నలుగురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడిన తర్వాత కాల్పులు జరుగుతున్నట్టు గ్వాదర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అస్లమ్ బాంగుల్జాయ్ ని ఉటంకిస్తూ డాన్ న్యూస్ తెలిపింది. హోటల్ లో దిగిన అందరు విదేశీ, స్థానిక అతిథులను సురక్షితంగా బయటికి తెచ్చినట్టు బెలూచిస్థాన్ సమాచార ప్రసార మంత్రి జహూర్ బులేదీ చెప్పారని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

నావికాదళం, సైనిక సిబ్బంది ఎన్ కౌంటర్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.50 నిమిషాలకు పీసీ హోటల్ లో ముగ్గురు నలుగురు సాయుధులు చొరబడినట్టు అధికారులు చెబుతున్నారు. ఫ్రాంటియర్ కోర్ సిబ్బంది హోటల్ ని చుట్టుముట్టినట్టు డాన్ న్యూస్ టీవీ పేర్కొంది. సాధారణంగా ఈ హోటల్ లో వ్యాపారం కోసం లేదా శెలవులు గడిపేందుకు వచ్చేవారు బస చేస్తారు. ఈ హోటల్ గ్వాదర్ లోని పశ్చిమ తీరం నుంచి దక్షిణంలో ఉన్న ఫిష్ హార్బర్ రోడ్ లో కోహ్ ఎ బాతిల్ దగ్గర ఉంది.